ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కురుక్షేత్రానికి సిద్ధం.. 175కి 175 స్థానాలూ మనవే: భీమిలి సభలో జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 06:42 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ‘సిద్ధం’ పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ నిర్వహించిన సంగివలస ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు.


‘‘భీమిలిలో అటు సముద్రం, ఇటు జనసంద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తోంది.. పద్మవ్యూహంలో చిక్కుకుకోడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు.. మీ అందరి అండదండలు ఉన్నంత కాలం నేను తొణకను.. బెణకను.. ప్రతి ఇంటికి చేసిన మంచిపనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కర్నీ ఓడించాల్సిందే’ అని జగన్ పిలుపునిచ్చారు.


‘‘75 ఏళ్ల వయసు మళ్లిన నాయకుడు చంద్రబాబు.. కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు.. చంద్రబాబుతో సహా అందర్నీ ఓడించాల్సిందే.. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదు.. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు.. దత్తపుత్రుడ్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు.. వారికి 175 సీట్లలో పోటీచేయడానికి అభ్యర్థులు కూడా లేరు.. అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం నడుస్తోంది. మేనిఫేస్టోలోని ఇచ్చిన ప్రతి హామీని పూర్తిగా నెరవేర్చాం.. 175 స్థానాలకు 175 గెలుపే మన లక్ష్యం.. ఇప్పటి వరకూ 99 శాతం హామీలు అమలు చేశాం.. 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.. ఇవాళ దేశంతో మన రాష్ట్రం పోటీ పడుతోంది.. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్లాలను అందజేశాం..’ అని జగన్ తెలిపారు.


‘‘ఈ యుద్ధంలో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలను గెలవాలి.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 670 వాగ్దానాలు ఇచ్చాడు.. వాటిలో 10 శాతం కూడా నెరవేర్చలేదు.. లంచాలు, విపక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ పథకాలను అందజేస్తున్నాం.. మరో 70 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. మోసం, విశ్వసనీయతకు మధ్య యుద్ధం ఈ ఎన్నికలు.. మంచి పనులు చేశాక తనకు అండగా నిలబడకుండా ఎవరైనా ఉంటారా?


కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ చంద్రబాబు ఏంచేశారో చెప్పడానికి వారికి కనిపించదు.. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుచేశాం.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్‌ను అభివృద్ధి చేశాం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం.. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను నిలువునా ముంచాడు.. పేదలకు ఒక్కటంటే ఒక్క ఇళ్లు పట్టా ఇవ్వలేదు.. రుణమాఫీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు మోసం.. చంద్రబాబు మార్పు ఏంటి.. 14 ఏళ్ల పాలించిన బాబు మార్క్ ఏముంది’’ అని టీడీపీపై జగన్ విమర్శలు గుప్పించారు.


‘‘క్యాబినెట్‌లో 68 శాతం బలహీనవర్గాల వారికి చోటుకల్పించాం.. నలుగురు పేద కులాల వారిని డిప్యూటీ సీఎంలుగా నియమించాం.. ఏకంగా 2.53 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మ ఖాతాల్లో జమచేశాం.. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.. ఇన్ని నిజాలు తెలిశాక చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తారా.. ఈ రోజు లంచాలు, వివక్షలేని వ్యవస్థ ఉంది.. రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చానని చెప్పడానికి గర్వపడుతున్నాను.. ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాం..మా ఐదేళ్ల పాలనలో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఎంత వేశామో చూడమనండి.. ’’ అని జగన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa