ఓ బిల్డర్‌ను హనీట్రాప్ చేసి.. భారీగా డబ్బులు వసూలుచేసిన ఘటన కర్నూలులో సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బిల్డర్‌ను నగరానికి పిలిపించి దోచేశారు. అమ్మాయితో వలపు వల విసిరి.. ప్లాన్ ప్రకారం ట్రాప్ చేశారు. కర్నూలు నగరానికి రాగానే మాటల్లో పెట్టి ఫొటోలు, వీడియోలు తీసి వాటి సాయంతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. బిల్డర్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. వారి చేతుల్లో మోసపోయిన సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. బాధితుడ్ని సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని హనీ ట్రాప్ చేసి దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ శివారెడ్డికి వరంగల్కు చెందిన ఓ యువతితో గతంలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు పాటు ఇరువురూ కలిసి తిరిగారు. తర్వాత శివారెడ్డి ఆమెను వదిలేయడంతో.. కర్నూలు చెందిన శ్రీనివాసరెడ్డి అనే మరో వ్యక్తితో యువతి పరిచయం పెంచుకుంది.
శ్రీనివాసరెడ్డిని వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసిన శివారెడ్డి.. గతంలో తనతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేక విషయం మొత్తం భర్త శ్రీనివాసరెడ్డికి చెప్పింది. దీంతో శ్రీనివాసరెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం, అనూరెడ్డి అనే మరో యువతి సాయంతో సోషల్ మీడియా ద్వారా హానీ ట్రాప్ చేశారు. ఆమె మైకంలో పూర్తిగా పడిపోయినట్టు తెలుసుకుని కర్నూలుకు పిలిపించారు. అబ్బాస్ నగర్లోని ఓ గదికి రప్పించి దాడిచేశారు. ఆ తర్వాత హిజ్రాలతో బెదిరించి, వారితో శివారెడ్డి ఉన్నట్లు ఫొటోలు తీశారు. అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. అంతేకాదు, కొన్ని ప్రామిసరీ నోట్లు సైతం రాయించుకున్నట్లు సమాచారం. అనంతరం హిజ్రాలతో ఉన్న ఫొటోలు చూపించి మరోసారి బ్లాక్ మెయిల్ చేశారు.