మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మించి నట్టేట ముంచారని, నాలాంటి వారికి మోసం చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏం తప్పు చేశానని? అక్రమ ఆస్తులు సంపాదించానా? అని ప్రశ్నించారు. సాదాసీదా నేతగా సేవ చేశానని, 14 ఏళ్లు వైఎస్ఆర్సీపీ జెండా మోసి, నిరంతరం శ్రమించానని, ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఆదిమూలం కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను మంత్రి పెద్దిరెడ్డి కన్నా సీనియర్‌ను అని అన్నారు.
‘ఎస్సీలని చిన్న చూపా, రిజర్వుడు నియోజకవర్గం అని చిన్న చూపా.. ఓపెన్ నియోజకవర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి మీటింగ్‌లు పెట్టమను.. స్కూటర్ మీద వచ్చే పెద్దిరెడ్డి.. ఈరోజు ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలుసు.. పెద్దిరెడ్డి చెప్పిందే నియోజకవర్గంలో చేశా.. పెద్దిరెడ్డిని కాదని చిన్న పని చేయలేదు.. ఈ రోజు నా నియోజకవర్గంలో ఆయన మీటింగ్ పెట్టడం ఏంటి’ అని ఆదిమూలం నిలదీశారు. అయితే, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తిరుపతి సిటింగ్ ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడుకు జగన్ పంపారు. ఈ క్రమంలో సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో తిరుపతిలో నిర్వహించారు. దీనికి ఆదిమూలం హాజరుకాలేదు.
అయితే, సత్యవేడు ఎమ్మెల్యే టికెట్టే తనకు కావాలని ఆదిమూలం పట్టుబడుతున్నారు. కానీ, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 1976 కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుత్తూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా.. జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్‌ను వీడి.. జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. కానీ, 2019 ఎన్నికల్లో 44,786 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.