హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని, విద్యా రంగాన్ని మెరుగుపరిచేందుకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు తెలిపారు. ఉనాలోని చింత్‌పూర్ణి అసెంబ్లీ నియోజకవర్గంలోని లాడోలిలో 'సర్కార్ గావ్ కే ద్వార్' కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజీవ్‌గాంధీ డే బోర్డింగ్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చింతపూర్ణి అసెంబ్లీ నియోజకవర్గంలో పాఠశాల ప్రారంభించేందుకు స్థలాన్ని ఎంపిక చేస్తున్నామని, ఏడాదిలోగా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.