మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనున్నందున 56 స్థానాలకు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో సహా తొమ్మిది మంది కేంద్ర మంత్రుల స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, అభ్యర్థుల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 చివరి తేదీ అని తెలిపారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు.