రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 234 పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్ ఇన్ రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.