వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు.