ఏపీలో సంచలనంరేపిన దళిత యువకుడికి శిరోముండనం కేసు మరో మలుపు తిరిగింది. యువకుడి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన నేతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేయించారన్న అభియోగాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలపై నమోదైన కేసును కొట్టేసేందుకు కోర్టు నిరాకరించింది. ఆరుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేసు దర్యాప్తు దశలో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడం కుదరదని స్పష్టం చేసింది. పిటిషనర్లపై తదుపరి చర్యలొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కీలక తీర్పు వెలువరించారు.
2020 జులై 20న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంరేపింది. ఇసుక మాఫియాను ఎదురించినందుకు వైఎస్సార్‌సీపీ నేత కవల కృష్ణమూర్తి, ఆయన అనుచరులు తనపై ఈ దురాగతానికి ఒడిగట్టారని బాధితుడు ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు వైఎస్సార్‌సీపీ నేత కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు శివప్రసాద్, నాగేంద్రబాబు, పుష్కరం, భూషణం, వీరబాబు, ఎస్సై తదితరులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తమపై కేసును కొట్టేయాలని కోరుతూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. 2020 సెప్టెంబరు 4న విచారణ చేసి.. వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వుల్చింది. ఇటీవల ఈ పిటిషన్‌పై హైకోర్టు తుది విచారణ జరిపింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే కారణంతో వరప్రసాద్‌ను కులం పేరుతో దూషించి, కొట్టారని బాధితుడి తరఫున లాయర్ వాదించారు. వైఎస్సార్‌సీపీ నేతల అండదండలతో పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారన్నారు. ఇటీవల ఈ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు.
మరోవైపుదళితులకు శిరోముండనం కేసులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. మరికొందరిపై 1997లో నమోదైన కేసును ఆరు నెలల్లో విచారణను పూర్తి చేయాలని విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. బాధితులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, వారి సాక్ష్యం నమోదుకు ప్రత్యేక కోర్టు నిరాకరించడం సీఆర్‌పీసీ సెక్షన్ 311, ఎస్సీ, ఎస్టీ చట్టం ఉద్దేశానికి విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితుల కుల ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరిస్తూ.. 2021 సెప్టెంబరు 7న ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఈ కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణను ప్రారంభించింది. బాధితులు/ఫిర్యాదుదారులు కోటి చిన్నరాజు, డి.వెంకటరత్నంల సాక్ష్యాల నమోదుకు ఈ నెల 5కు వాయిదా వేసింది.