ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ చేరుకున్నాయి. హేమంత్ సోరెన్ రాజీనామా.. అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ హైడ్రామా తర్వాత ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జార్ఖండ్ అసెంబ్లీలో చంపై సోరెన్ బలపరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలతో కూడిన కూటమి రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే సీఎంకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను అందర్నీ హైదరాబాద్ తరలించారు.
ఈ క్రమంలోనే జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలు రాంచీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే రాంచీ ఎయిర్‌పోర్టులో జేఎంఎం ఎమ్మెల్యే హఫిజుల్ హసన్‌ను మీడియా ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా.. దానికి ఆయన వింత జవాబు ఇచ్చారు. తాము హైదరాబాద్‌కు బిర్యానీ తినేందుకు వెళ్తున్నట్లు ఆ ఎమ్మెల్యే సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇక జార్ఖండ్ అసెంబ్లీలో తమ శక్తి చూపిస్తామని ఎమ్మెల్యే బన్నా గుప్తా తెలిపారు.
జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా సీనియర్ జేఎంఎం ఎమ్మెల్యే, మంత్రి చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతుతో జేఎంఎం పార్టీకి 47 మంది ఎమ్మెల్యేలకు మద్దతు ఉందని సీఎం చంపై సోరెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే 10 రోజుల్లో అసెంబ్లీలో ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ సీఎంకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు తమ కూటమి నుంచి జారిపోకుండా ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే తమ వర్గానికి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను సీఎం చంపై సోరెన్ హైదరాబాద్ తరలించారు. నగర శివారులో ఉన్న లియోనియా రిసార్ట్‌కు జార్ఖండ్ ఎమ్మెల్యేలను చేర్చారు. జార్ఖండ్‌లో అధికార కూటమి ఎమ్మెల్యేలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలను రక్షించుకుని.. బలపరీక్షలో నెగ్గాలని సీఎం చంపై సోరెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను తమ నుంచి జారిపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఇటీవలె అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. కోర్టు ముందు ప్రవేశపెట్టి.. అనంతరం జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. సుమారు రూ.600 కోట్ల భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.