ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు చేరుకోవడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నమోదు చేసిన కేసులో నోటీసులు ఇచ్చేందుకే ఢిల్లీ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపి.. రాజీనామా చేసిన తర్వాత అరెస్ట్ చేయగా.. తాజాగా ఢిల్లీ సీఎం ఇంటికి పోలీసులు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఢిల్లీ మద్యం కేసులో ఇచ్చిన ఈడీ సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించడంతో ఆయనను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
అయితే ఇటీవల పదే పదే బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు చెల్లించి వారిని తమ పార్టీలోకి లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీజేపీ.. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులోనే ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ హాజరు కావాలని ఇప్పటికే పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. తాజాగా శుక్రవారం విచారణకు రావాలని ఐదోసారి ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోకపోవడం గమనార్హం. మొదటి నుంచి ఈడీ సమన్లను పట్టించుకోని అరవింద్ కేజ్రీవాల్.. అవి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ రాజకీయ కక్షతోనే జారీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే పలుమార్లు ఆప్ నేతలతో కేజ్రీవాల్ చెప్పారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది.