ఏనుగుతో సెల్ఫీకి ప్రయత్నించిన పర్యాటకులు.. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఏనుగుతో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా గజరాజు వెంబడించింది. దీంతో దాడి నుంచి తప్పించుకోడానికి ఇద్దరూ పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కింద పడిపోగా.. అతడ్ని తన కాళ్ల కింద పడేసి తొక్కేయాలని చూసింది. కానీ, ఇంతలోనే వెనక్కి వెళ్లిపోయింది. అతడి అదృష్టం బాగుండి స్వల్పగాయాలతో బతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే ఈ ఘటన కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని బందిపూర్ వాయనాడ్ జాతీయ పార్కులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులుగా భావిస్తున్నారు.
వైరల్ అయిన వీడియో ప్రకారం.. అడవి మధ్యలో ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి కిందకు దిగి.. ఫోటీలు, వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ అడవి ఏనుగుతో సెల్ఫీ దిగాలని భావించారు. ఊహించని విధంగా ఏనుగు వారిని వెంబడించింది. దానిని నుంచి తప్పించుకోడానికి ఇద్దరూ పరుగులు తీస్తుండగా.. ఓ వ్యక్తి కిందపడిపోయాడు. అతడ్ని తొక్కేయడానికి ప్రయత్నించి.. ఎందుకో మళ్లీ మనసు మార్చుకుని వెనక్కి వెళ్లిపోయింది. దీంతో అతడు తప్పించుకోగలిగాడు. మెల్లగా పాక్కుంటూ చెట్లల్లోకి వెళ్లి.. అక్కడ నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో ఆంక్షలు విధించడాన్ని మరోసారి గట్టిగా డిమాండ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో కారులోంచి బయటకు దిగడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘బందీపూర్-వాయనాడ్ టైగర్ రిజర్వ్ వద్ద ఏనుగు దాడి నుంచి బయటపడిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు’ అని ఓ నెటిజన్.. ‘మీరు వన్యప్రాణులతో ఆడుకునే అవకాశం లేదు. అతడు ప్రాణాలతో బయటపడడం అదృష్టమే’ అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే, బందీపూర్‌లో పర్యాటకులను ఏనుగులు వెంబడించడం, కోపంతో తరమడం ఇదే మొదటిసారి కాదు. సఫారీలో ఉన్న పర్యాటకులను ఏనుగు వెంబడించిన వీడియో గతేడాది వైరల్ అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, బండి నడపడటంతో త్రుటిలో దాడి నుంచి తప్పించుకున్నారు. గత కొన్ని నెలలుగా కర్ణాటకలో అడవి జంతువులు, మనుషుల సంఘర్షణ గణనీయంగా పెరిగింది. విశాలమైన అడవులతో నిండి ఉన్నందున ఇటువంటి సంఘటనలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను కూడా ఏర్పాటు చేసింది.