మోసగాళ్లు రూటు మారుస్తున్నారు. అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వ్యవహారమే ఒకటి ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. జనం ఆశను అలుసుగా తీసుకుని నకిలీనోట్ల దందా సాగిస్తున్నారు కొంతమంది దుండగులు. అయితే సీన్ కాస్తా రివర్సై వారి ప్లాన్ బయటపడింది. అయితే మోసం బయటపడిందని గుర్తించి.. స్థానికుల చేతికి చిక్కకుండా తప్పించుకున్నారు.
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడులో దొంగనోట్లు కలకలం సృష్టించాయి. కారులో వచ్చిన ఓ వ్యక్తి స్థానికంగా ఉండే మద్యం దుకాణం వద్ద కారును ఆపాడు. అక్కడే ఉన్న వ్యక్తిని పిలిచి తన చేతికి ఐదువందల రూపాయల నోటు అందించాడు. మద్యం దుకాణంలో ఓ క్వార్టర్ కొనుక్కోమని, అలాగే తనకు కూడా ఓ క్వార్టర్ బాటిల్ పట్టుకురమ్మని చెప్పాడు. ఫ్రీగా క్వార్టర్ దొరుకుతోందనే ఆశతో ఆ వ్యక్తి.. షాపు వద్దకు వెళ్లి క్వార్టర్ బాటిల్స్ ఇమ్మని అడిగాడు. అయితే అతను ఇచ్చిన ఐదొందల నోటు తీసుకున్న మద్యం షాపు యజమాని అది నకిలీ నోటుగా గుర్తించాడు. వెంటనే నకిలీ నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి.. కారులో ఉన్న అతను ఇచ్చాడంటూ అతనివైపు చూపించాడు.
ఈనేపథ్యంలో మద్యం షాపు ఓనర్ కారు వద్దకు వచ్చి నకిలీ నోటు ఇచ్చావంటూ కారులోని వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో తన బండారం బయటపడిందని గ్రహించిన ఆగంతకుడు.. అక్కడి నుంచి కారులో ఉడాయించాడు. అప్పటికే పక్కనున్న బడ్డీ కొట్టులో అలా ఓ 500 రూపాయల నోటు మార్చినట్లు స్థానికులు గుర్తించారు. మోసగాడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. కారులో వేగంగా కంభంవైపు పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వేములపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాల్లో ఎవరైనా ఇలా దొంగనోట్లు ఇచ్చి వస్తువులు కొన్నారా అనే విషయంపై ఆరాతీస్తున్నారు.