న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణియన్ స్వామి స్వరం పెంచారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయకపోతే.. రామమందిర నిర్మాణం రేపే మొదలుపెట్టొచ్చని ఆయన అన్నారు. 2019 ఎన్నికలకు ముందే రామమందిరం నిర్మిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే రామమందిరం నిర్మించగలదంటూ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను స్వామి సమర్థించారు.
‘‘యోగి ఆదిత్యనాథ్ సరిగ్గానే చెప్పారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రేపే రామమందిరం కట్టొచ్చు. లోక్‌సభ ఎన్నికలకు ముందే రామమందిరం నిర్మించాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయం ఖాయమన్నారు. ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొద్ది సీట్ల తేడాతోనే ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీకి ఓట్లేసిన వారంతా లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ వైపే ఉంటారు..’’ అని స్వామి పేర్కొన్నారు.