పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం సాగర సంగ్రామ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా సీపీఎస్ రద్దుకోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆశలను వమ్ము చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పీఆర్‌టీయూ నేత గోపినాథ్ మాట్లాడుతూ ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, చివరి అవకాశంగా ఓపీఎస్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆర్థిక కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ మాట తప్పిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13.2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా వ్యవహరించిన నాత ప్రసాద్ మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరించేలా ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేయించిందన్నారు. జిల్లా అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మేనిఫెస్టోలోని సీపీఎస్ రద్దు హామీని ఎందుకు అమలుచేయలేదని సీఎంను ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ రమాదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు. దీక్ష ప్రాంగణంలో సీపీఎస్ అంతిమయాత్ర నిర్వహించారు. పాత పెన్షన్ పేరుతో ఏర్పాటు చేసిన సమాధి వద్ద నేతలు నివాళులర్పిస్తూ నిరసన తెలిపారు. పలువురు మహిళా ఉద్యోగులు చెవిలో క్యాబేజీలు పెట్టుకుని నిరసన తెలిపారు.