ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడం సంచలనం సృష్టించింది. దీంతో జైలు అధికారులతోపాటు.. మిగిలిన ఖైదీల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ 63 మంది ఎయిడ్స్ రోగుల్లో 36 మందికి ఇటీవల డిసెంబర్‌లో చేసిన వైద్య పరీక్షల్లో ఈ హెచ్ఐవీ వైరస్ ఉన్నట్లు తేలిందని జైలు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు.. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
జైలులో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ సోకడంపై జైలు అధికారులు స్పందిచారు. అయితే జైలులో హెచ్ఐవీ పరీక్షలు చేయడానికి టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవని.. అందుకే గతేడాది సెప్టెంబర్ నుంచి ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయలేదని వెల్లడించారు. అందుకే ఆలస్యంగా డిసెంబర్‌లో జైలులోని ఖైదీలందరికీ పరీక్షలు నిర్వహించగా.. అందులో 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అయితే జైలులో హెచ్ఐవీ సోకిన ఖైదీలలో ఎక్కువ మందికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలిపారు. జైలుకు రాక ముందు సురక్షితం కాని సిరంజిల ద్వారా మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల వారికి ఎయిడ్స్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జైలులోకి వచ్చిన తర్వాత ఏ ఖైదీకి కూడా హెచ్‌ఐవీ సోకలేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో హెచ్‌ఐవీ వైరస్ కారణంగా ఒక్క ఖైదీ కూడా మరణించలేదని జైలు అధికారులు వెల్లడించారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో బాధితులందరికీ లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఖైదీల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. జైలులో భారీగా ఎయిడ్స్ కేసులు వెలుగు చూడటంతో దానికి గల కారణాలను అన్వేషించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడంతో జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జైలులో హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరగకుండా వైద్యారోగ్యశాఖ సూచన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.