పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై నేరం రుజువైతే కఠిన శిక్షలు వేసేందుకు సంబంధించిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీలు సహా ఇతర చట్ట ఉల్లంఘనలు చేస్తే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. కోటి జరిమానా విధించేందుకు బిల్లును రూపొందించింది. ఈ బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రసంగంలో కూడా ఈ బిల్లు గురించి ప్రస్తావన చేయడం గమనార్హం.
ఈ బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లును రూపొందించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ పేరుతో బిల్లును కేంద్రమంత్రి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం నిందితులపై నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఈ పోటీ పరీక్షల్లో రెచ్చిపోయే ముఠాలు, మాఫియాపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. వారికి సహకరించే ప్రభుత్వ అధికారులకు కూడా కఠిన శిక్షలు పడనున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రశ్నా పత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడటం, రద్దు కావడం జరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యువతకు భరోసా ఇచ్చేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని.. విద్యార్థుల లక్ష్యంగా ఈ బిల్లు తీసుకురాలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ బిల్లు గురించి ప్రస్తావించడం విశేషం. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని.. ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని రాష్ట్రపతి వెల్లడించారు. తెలంగాణలో కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ పరీక్షలన్నింటినీ అప్పటి ప్రభుత్వమే రద్దు చేసింది. ఈ కేసుల్లో నిందితులు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశారు.