ఈ మధ్య కాలంలో నగరంలో ప్రయాణించాలంటే ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులను మనం ఉపయోగించుకుంటున్నాం. మనం ఉన్న చోటు నుంచి కావాల్సిన చోటుకు రైడ్ బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నాం. అయితే ఒక్కోసారి మనం క్యాబ్ బుక్ చేసుకున్నపుడు ఒక రేటు చూపిస్తే.. గమ్యాన్ని చేరిన తర్వాత అది భారీగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూశాం. అయితే ట్రాఫిక్ కారణంగా లేట్ కావడం, పీక్ అవర్స్‌లో సర్ ఛార్జీల బాదుడుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేది. అయితే అది ఏమైనా క్యాబ్ డ్రైవర్ జేబులోకి వెళ్తుందా అంటే అదీ లేదు. అటు డ్రైవర్ ఇటు.. కస్టమర్ కాకుండా మధ్యలో ఉన్న ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ కంపెనీలు లాభపడేవి. ఇలా కస్టమర్ల నుంచి, డ్రైవర్ల నుంచి ట్యాక్సీ కంపెనీలపై తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా ఛార్జీలు వేయకుండా ఆంక్షలు విధించింది. ఓలా, ఉబర్ సహా అన్ని ట్యాక్సీ సంస్థలకు ఫిక్స్‌డ్ ఫేర్ రూల్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఇక నుంచి ట్యాక్సీ సంస్థలు ప్రజలపై ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు బాదకుండా సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ క్యాబ్ ఛార్జీలకు కళ్లెం వేసింది. ఓలా, ఉబర్ వంటి యాప్ బేస్డ్ ట్యాక్సీ సంస్థలతో నాన్ యాప్ బేస్డ్ ట్యాక్సీ సంస్థలకు ఫిక్స్‌డ్ ఫేర్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఫిక్స్‌డ్ ఫేర్ రూల్ అనే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఫిక్స్‌డ్ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీస్‌లను 3 భాగాలుగా సిద్ధరామయ్య ప్రభుత్వం విభజించింది. రూ.10 లక్షలు.. ఆ లోపు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే.. మొదటి 4 కిలో మీటర్లకు ఫిక్స్‌డ్ ఛార్జీలు విధించనున్నారు. 4 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తే ఒక్కో కిలోమీటర్‌కు రూ.24 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉన్న క్యాబ్‌లలో ప్రయాణిస్తే మొదటి 4 కిలోమీటర్లకు మినిమమ్ రేటు రూ.115 గా నిర్ణయించింది. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.28 వసూలు చేయవచ్చని తెలిపింది. ఇక వాహనం ధర రూ.15 లక్షలు అంతకు మించి ఉంటే మొదటి 4 కిలోమీటర్లకు రూ. 130.. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ. 32 వసూలు చేయాలని సూచించింది.
ఇక యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థలు 5 శాతం జీఎస్టీతోపాటు, టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీస్‌లను అందించే సంస్థలు సాధారణ ధరలకు 10 శాతం అదనంగా వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇక మొదటి 5 నిమిషాల వెయిటింగ్‌కు ఎలాంటి ఛార్జీ ఉండదని.. ఆ తర్వాత నిమిషానికి రూ.1 చొప్పున వెయిటింగ్ ఛార్జీలు ఉంటాయని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓలా, ఉబర్ సంస్థలు స్వాగతించాయి. అయితే పలువురు ప్రయాణికులు మాత్రం.. గతంలో ఉన్న ధరల కంటే ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మొదటి 4 కిలోమీటర్ల దూరానికి కేవలం రూ.75 మాత్రమే ఉండేదని ప్రస్తుతం అది రూ.100 కు చేరుకుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజలను లెక్కలోకి తీసుకోకుండా ఈ ఛార్జీల పెంపు చేశారని వాపోతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని క్యాబ్ డ్రైవర్లు కూడా స్వాగతించారు. ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసుల్లో తాను 3 ఏళ్లుగా పని చేస్తున్నానని.. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు ఒక డ్రైవర్ తెలిపాడు.