పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు లోక్‌సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తాము హ్యాట్రిక్ కొడతామని తేల్చి చెప్పారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు, నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మూడోసారి గెలిచి అధికారంలోకి వచ్చాక.. పెద్ద పెద్ద కీలక నిర్ణయాలు తీసుకుంటామని.. అవి దేశ అభివృద్ధికి వెయ్యేళ్లపాటు తోడ్పాటును అందిస్తాయని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీపై.. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉండేందుకు ఇండియా కూటమి తీర్మానించిందని ఎద్దేవా చేశారు. పాత వస్తువునే తిరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతోందని.. ఆ పార్టీ మూతపడే దశలో ఉందని.. రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని.. అందులో బీజేపీనే 370 కిపైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే అబ్ కీ బార్ మోదీకీ సర్కార్ అంటూ నినాదాన్నిచ్చారు.
మూడోసారి అధికారంలోకి వచ్చాక.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. 2014 లో తాము అధికారంలోకి వచ్చినపుడు ప్రపంచంలో 11 వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం 5 వ స్థానానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇక భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని ఆరోపించారు. ప్రధానిగా తొలి ప్రసంగం చేసిన జవహర్ లాల్ నెహ్రూ.. విదేశీయులతో పోలిస్తూ భారతీయులకు నైపుణ్యం లేదని చెప్పినట్లు మోదీ గుర్తు చేశారు. అప్పుడే భారతీయుల శక్తిపై నెహ్రూ విశ్వాసం వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారని.. భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్నచూపు చూశారని ఆరోపించారు. వాళ్లిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదని దుయ్యబట్టారు.
ఇక దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం చేయలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓబీసీ నాయకులను వారు అవమానించారని మండిపడ్డారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు తాము భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించామని.. కానీ ఆయన సీఎంగా ఉన్నపుడు.. కుట్రలు చేసి కర్పూరీ ఠాకూర్‌ను గద్దె దించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖాదీని మరిచిపోయారని.. కానీ తాము మాత్రం ఖాదీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370 ని రద్దు చేశామని.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేశామని తెలిపారు. వలసవాదుల కాలం నాటి చట్టాలను తొలగించి.. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాముడు తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడని.. ఇది దేశానికి సరికొత్త శక్తిని ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఇండియా కూటమిపైనా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉండాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించుకున్నారని.. వారి కోరికను ఆ దేవుడు నెరవేర్చుతాడని ఎద్దేవా చేశారు. కూటమిలో పొత్తు కుదిరిందని.. కానీ ఒక పార్టీపై మరొక పార్టీకి విశ్వాసం లేదని.. అలాంటి సమయంలో దేశ ప్రజలు వారిని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అందుకే ఆ కూటమి కూలిపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలను పాలిస్తూ చిన్నచూపు చూసేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నత్తనడకతో ఎవరూ పోటీ పడలేరని తెలిపారు.