వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ వస్తుంది. మార్కెట్లలో ఎక్కడ చూసినా రకరకాల వెరైటీల మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. అయితే ఇంకా వేసవి రాకముందే మామిడి పండ్లు మాత్రం మార్కెట్లలోకి వచ్చాయి. సీజన్ కంటే ముందే మామిడి పండ్లు మార్కెట్‌లలోకి వచ్చాయని సంతోషించాలో లేక వాటి ధర చూసి బాధపడాలో ఇప్పుడు మ్యాంగో లవర్స్‌కు అర్థం కావడం లేదు. ఎందుకంటే డజన్ మామిడి పండ్ల ధర రూ.7 వేలు పలుకుతోంది. దీంతో అది చూసి మామిడి పండ్ల ప్రియులు షాక్ అవుతున్నారు. మామిడి పండ్లను చూస్తే నోట్లో ఊరాల్సిన నీళ్లు కాస్తా.. వాటి ధర చూసి కళ్ల వెంబడి వస్తున్నాయని.. వాపోతున్నారు.
గోవాలో లోకల్ రకమైన మంకురాడ్ మామిడి పండ్లు వేసవి సీజన్ కంటే ముందే మార్కెట్లలోకి వచ్చేశాయి. కానీ అవి ముందుగానే మార్కెట్లలోకి వచ్చినా అటు వినియోగదారులు, ఇటు మార్కెట్ వర్గాలకు సంతోషం మాత్రం లేదు. ఎందుకంటే ఈ మంకురాడ్ మామిడి పండ్లు భారీ ధర పలుకుతున్నాయి. సాధారణంగా వేసవిలో మార్కెట్‌లోకి వచ్చే ఈ మంకురాడ్ మ్యాంగోస్.. ఇప్పుడే వచ్చాయి. అయితే గతేడాది ఈ మంకురాడ్ మామిడి పండ్లు గరిష్ఠంగా రూ.6 వేలకు డజన్ లెక్కన విక్రయించారు. కానీ ఈసారి మాత్రం సీజన్ ప్రారంభంలోనే ఇవి డజన్‌కు రూ.7 వేలు పలకడంతో వినియోగదారులు భయపడుతున్నారు.
అయితే సీజన్ కంటే ముందుగా రావడంతోనే మంకురాడ్ మామిడి పండ్ల ధరలు భారీగా ఉన్నాయని.. మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఈ మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయని.. సీజన్ కూడా కాకపోవడంతో వాటి ధరలు భారీగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 15 తర్వాత నుంచి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ మార్కెట్లలోకి వచ్చే మొదటి మామిడి పండ్ల రుచి చూసేందుకు జనం ఉవ్విళ్లూరుతున్నారని.. అయితే చాలా మంది మాత్రం ఈ అధిక ధరలు చూసి కొనడం లేదని తెలిపారు.
ఇక ఏప్రిల్ నెలలో మామిడి పండ్ల ధరలు అందుబాటు ధరల్లోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్‌లోకి ఎక్కువగా మామిడి పండ్లు వస్తే ధరలు తగ్గుతాయని.. రూ.6 వేలకు డజన్ లాగా విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఈ మంకురాడ్ మామిడిపండ్లు చాలా వరకు బిచోలిమ్ తాలుకా నుంచి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బిచోలిమ్ తాలుకా రైతులు ఈ మామిడి పండ్లను త్వరగా కోసి సీజన్ కంటే ముందే మార్కెట్‌కు తరలిస్తున్నట్లు చెప్పాయి. ఇక మార్కెట్లోకి ఇతర రకాల మామిడి పండ్లు కూడా వస్తే అధిక ధరలు తగ్గి సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉంటాయని చెబుతున్నాయి.