సాధారణంగా ఏదైనా కేసులో అరెస్ట్ అయి.. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వారు ఎక్కడికీ తప్పిపోకుండా ఉండేందుకు వారి చేతులకు సంకెళ్లు కూడా వేస్తారు. వారిని కోర్టుకు, జైలుకు తీసుకువెళ్తున్నప్పుడు.. పారిపోకుండా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్ర సంఘటన జరిగింది. నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు ఒక వాహనంలో బయల్దేరారు. అయితే మార్గమధ్యలో ఆ వాహనంలో డీజిల్ అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక.. నిందితులను వాహనం దించి.. వారితో తోయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అనుకోని సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.
బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో ఆల్కహాల్ సేవించినందుకు పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారిని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్తుండగా.. కాచాహారి చౌక్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనంలో డీజిల్ అయిపోయింది. దీంతో అది నడిరోడ్డుపై ఆగిపోయింది. పక్కన పెట్రోల్ బంకు లేకపోవడంతో ఆ నలుగురు నిందితులతో వాహనాన్ని పోలీసులు తోయించారు. దాదాపు అర కిలోమీటర్ వరకు నిందితులతో పోలీసులు వ్యాన్‌ను నెట్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
అయితే వాహనాన్ని తోసే సమయంలో ఆ నిందితులు పారిపోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వారి నడుముకు ఒక తాడును కట్టారు. ఈ సంఘటన ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం పోలీసుల తీరు పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్య పానం సేవించిన కేసులో అరెస్ట్ అయిన నిందితులతో పోలీస్ వ్యాన్ తోయించి.. కరెక్ట్ శిక్ష వేశారని కొందరు నెటిజన్లు తెలిపారు. ఇక కేసు తీర్పు ఇచ్చే సమయంలో నిందితులు పడిన కష్టాన్ని జడ్జి గుర్తించి.. శిక్షను కాస్త తగ్గించాలని మరొకరు పేర్కొన్నారు. చావును తోసుకుంటూ వెళ్తున్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. నిందితులకు తగిన శాస్తి జరిగిందని మరో నెటిజన్ తెలిపాడు.
ఈ ఘటనపై స్థానిక ఏసీపీ ప్రమోద్ నారాయణ్ సింగ్ స్పందించారు. డీజిల్ అయిపోయిన వాహనాన్ని నడిరోడ్డుపై నిందితులతో పోలీసులు తోయించిన ఘటన తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంపై త్వరలోనే దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.