గోబీ మంచూరియాను చూస్తే నోరు తెగ ఊరిపోతుంది. గోబీ మంచూరియా లవర్స్ అయితే దాన్ని చూస్తే తినకుండా ఉండలేరు. అలాంటి గోబీ మంచూరియా ఇక నుంచి ఆ నగరంలో కనిపించదు. ఎందుకంటే ఈ గోబీ మంచూరియాను తయారు చేయడంపై అక్కడ నిషేధం విధించారు. అదేంటీ జనం అంతలా ఇష్టపడే గోబీ మంచూరియాను ఎందుకు నిషేధించారు. అని ఆశ్చర్యపోతున్నారా. నమ్మలేకపోయినా ఇదే నిజం. అయితే ఏదైనా ఆహార పదార్థాన్ని తయారు చేయకుండా నిషేధం విధించారు అంటే దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఉంటేనే ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ గోబీ మంచూరియాను కూడా నిషేధించడానికి కారణం అదే ఉంది. అదేంటంటే?
గోవాలోని మపుసా నగరంలో గోబీ మంచూరియా తయారీ, విక్రయాలపై స్థానిక అధికారులు నిషేధం విధించారు. అయితే గోబీ మంచూరియాను అపరిశుభ్రంగా తయారు చేయడం.. దాని తయారీలో ప్రమాదకర రంగులను వాడుతుండటమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు. గోబీ మంచూరియాను తయారు చేయడానికి వాడే సింథటిక్ రంగులు.. దాని పరిశుభ్రతపై ఆహార నిపుణులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన కారణంగా మపుసా మున్సిపల్ కౌన్సిల్ అధికారులు.. ఆ నగరంలో గోబీ మంచూరియా తయారీపై నిషేధం ప్రకటించారు. మపుసా నగరంలోని ఫుడ్ స్టాల్స్, ఫంక్షన్స్‌లో గోబీ మంచూరియన్ తయారీపై బ్యాన్ విధించారు.
అయితే మపుసా నగరం కాకుండా మరో నగరంలో కూడా గోబీ మంచూరియాను ఇప్పటికే నిషేధించారు. 2022 ఏడాదిలోనే మోర్ముగావ్ నగరంలోనూ గోబీ మంచూరియా తయారీపై నిషేధం విధించారు. మోర్ముగావ్‌లోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌లో గోబీ మంచూరియన్ తయారీపై అక్కడి మున్సిపల్ కౌన్సిల్ నిషేధం విధించింది. అంతే కాకుండా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. మోర్ముగావ్‌లోని గోబీ మంచూరియన్ తయారు చేసే రెస్టారెంట్లు ఫుడ్ స్టాళ్లపై దాడులు నిర్వహించారు. దీంతో అప్పటి నుంచి మోర్ముగావ్ నగరంలో గోబీ మంచూరియాను తయారు చేయడం నిలిపివేశారు.