దాదాపు పది రోజులుగా కొనసాగుతున్న ఝార్ఖండ్ సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్ సర్కారు బలపరీక్షలో నెగ్గింది. సోమవారం జరిగిన ఓటింగ్‌లో చంపై సర్కారుకు అనుకూలంగా 47 ఓట్లు.. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో హేమంత్ సోరేన్ రాజీనామాతో ఏర్పడిన సంక్షోభం ముగిసిపోయింది.మనీ ల్యాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ్ జనతా దళ్‌తో కలిపి 47 మంది సభ్యుల మద్దతు చంపై సోరెన్‌కు ఉంది. మెజార్టీ మార్క్‌కు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో వీరంతా ఓటింగ్‌లో పాల్గొని.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విపక్ష బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని హైదరాబాద్ తరలించారు. రెండు రోజుల అనంతరం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిని 37 మంది ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో ఓటు వేసేందుకు పీఎంఎల్ఏ కోర్టు అనుమతించింది. అసెంబ్లీలో సభ్యుడిగా ఓటు వేసే హక్కు ఆయనకు ఉందని స్పష్టం చేసింది. దీంతో హేమంత్ సోరెన్ ఈ రోజు ఓటింగ్‌లో పాల్గొన్నారు.