వారణాసిలోని జ్ఞానవాపీ, మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మథురలను శాంతియుతంగా అప్పగిస్తే విదేశీ ఆక్రమణదారులు ధ్వంసం చేసిన ఇతర దేవాలయాల సమస్యలను హిందూ సమాజం మరచిపోతుందని అన్నారు. విదేశీ దాడుల్లో 3,500 హిందూ దేవాలయాలు నేలమట్టమయ్యాయని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని పుణే సమీపంలో అలందిలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తన 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 11 వరకూ అలందిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సహా ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ‘ఈ మూడు దేవాలయాలు విముక్తి పొందినట్లయితే మనం ఇతరుల వైపు చూడాలని కూడా కోరుకోం.. ఎందుకంటే మనం గతంలో కాకుండా భవిష్యత్తులో జీవించాలి. దేశ భవిష్యత్తు బాగుండాలి, అందుకే మనం మిగిలిన రెండు దేవాలయాలను (కాశీ, మధుర) శాంతియుతంగా ప్రేమతో పొందినట్లయితే మనం మిగతా విషయాలన్నీ మరచిపోతాం’ అని ఆయన అన్నారు.
శాంతియుత పరిష్కారం కోసం ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని మహరాజ్ ముస్లిం సమాజాన్ని కూడా కోరారు. కేవలం దాడులకు సంబంధించిన ఆనవాళ్లను తొలగించడమే సమస్య అని, దీన్ని రెండు వర్గాల మధ్య సమస్యగా భావించరాదని సూచించారు. ‘రామమందిర వివాదానికి మనం శాంతియుత పరిష్కారాన్ని కనుగొన్నాం.. అటువంటి యుగం ప్రారంభమైనందున ఇతర వివాదాలను కూడా శాంతియుతంగా పరిష్కరించకుంటామని మేము ఆశిస్తున్నాం’ అన్నారాయన. మిగిలిన రెండు దేవాలయాల కోసం శాంతియుత పరిష్కారానికి ముస్లిం సమాజంలోని ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అయితే కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారని మహరాజ్ పేర్కొనారు. ‘మేము పరిస్థితిని బట్టి ఒక స్టాండ్ తీసుకుంటాం.. వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం. ఎలాంటి అశాంతియుత వాతావరణం ఏర్పడకుండా చూస్తాం’’ అని చెప్పారు