గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా హైదరాబాద్‌పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఇదే సందర్భంలో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, హైదరాబాద్‌ను కోల్పోవటంతో ఆదాయం కోల్పోయామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం, హైదరాబాద్‌ను కోల్పోవటంతో ఏపీ ఆదాయం బాగా తగ్గిందని అన్నారు. దీనికి కరోనా జతకావటంతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నగదు బదిలీ ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామని వివరించారు.
హైదరాబాద్‌ను కోల్పోవటంతో ఏపీది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీగా మారిందని జగన్ అన్నారు. అడ్డగోలు విభజన కారణంగా ఏటా 13 వేల కోట్లు నష్టపోయామని చెప్పారు. ఈ ఐదేళ్లలోనే లక్షకోట్ల అదనపు ఆదాయం కోల్పోయామన్న జగన్.. ఆర్థికలోటు ఇప్పటికీ రాష్ట్రాన్ని వెంటాడుతోందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా పదేళ్లలో లక్షా 40 వేలకోట్లు నష్టపోయామని అన్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ విధానాల వలన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని చెప్పుకొచ్చారు.
ఇక రాష్ట్రం ఆర్థికంగా ఎదిగేందుకు పెద్దపెద్ద నగరాలు కావాలన్న జగన్.. ప్రతి రాష్ట్రానికి ఓ పవర్ హౌజ్ లాంటి నగరం ఉండాలన్నారు. మనకూ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి నగరాలు కావాలన్న జగన్.. పెద్ద నగరంగా మారే అవకాశం ఉన్నందునే విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. అప్పులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్న సీఎం..విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో వైసీపీ ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిదనీ.. ఇప్పుడది ఏడు లక్షల కోట్లకు చేరిందని వివరించారు. 57 నెలల్లో అవినీతి లేకుండా ప్రజలకు నగదు బదిలీ చేశామన్న జగన్.. విపక్షాల దుష్ర్పచారాన్ని నమ్మకుండా జనం వాస్తవాలు ఆలోచించాలని అసెంబ్లీ ప్రసంగం సందర్భంగా విజ్ఞప్తి చేశారు.