రైలు అనేది మధ్య తరగతి జీవితాలతో పెనవేసుకుని పోయిన ఓ ఎమోషన్. దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే సగటు కుటుంబరావు మదిలో మెదిలో తొలి ఆప్షన్ రైలే. అందుకే అదేదో సినిమాలో రైలంటే మిడిల్ క్లాస్ నేల విమానం అన్నాడో సినీ రచయిత. ఇక పండగల పూట, సెలవురోజుల్లో రైళ్లో సీటు దొరకాలంటే సుమారు 20 నుంచి 30 రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. తెలిసిన వాళ్లు ఆన్‌లైన్‌లో సీటు బుక్ చేసుకుంటారు.. తెలియని వాళ్లు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారానో, షాపుల ద్వారానో టికెట్ రిజర్వ్ చేయించుకుంటారు. ఇక రిజర్వేషన్ సీట్లు ఫుల్ అయ్యి వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంటే.. కౌంటర్‌కు వెళ్లి జనరల్ బోగీల్లో టికెట్ తీసుకోవటం తప్పదు.
అయితే టికెట్ కౌంటర్ వద్ద టికెట్లు కొనుగోలు చేస్తూ చిల్లర లేక ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా.. ఇకపై అలాంటి చింత, ఇబ్బంది అవసరం లేదంటోంది రైల్వేశాఖ. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు అందుబాటులోకి తెచ్చే దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల కష్టాలతో పాటు చిల్లర ఇచ్చే విషయంలో కౌంటర్‌లోని రైల్వే సిబ్బంది బాధలను అర్థం చేసుకుని టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ కౌంటర్‌లలో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కల్పించింది. టికెట్‌కు సరిపడా చిల్లర మనవద్ద లేని సమయంలో డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే సౌకర్యం తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో రైల్వే కౌంటర్ల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడా పేమెంట్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీని ద్వారా చిల్లర కష్టాలు తీరడమే కాకుండా టికెట్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు చిల్లర కష్టాలు తప్పుతాయని అభిప్రాయపడుతున్నారు.