సంసారం అన్న తర్వాత చిన్నపాటి కొట్లాటలు సహజం. కొన్ని జంటలు అలకలను కూడా ఓ రొమాన్స్‌గా చూస్తే.. మరికొన్ని మాత్రం సీరియస్‍గా తీసుకుని కాపురంలో నిప్పులు పోసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా పల్నాడు జిల్లాలో భార్యాభర్తల మధ్యన వచ్చిన అభిప్రాయబేధాలు చిలికి చిలికి గాలివానగా మారి ఇద్దరు చిన్నారుల ప్రాణం తీశాయి. అయితే భార్య నుంచి వచ్చిన ఊహించని ప్రమాదాన్ని పసిగట్టిన భర్త తెలివిగా బయటపడగా.. పాపం పిల్లలు బలైపోయారు. నిండు నూరేళ్లు బతకాల్సిన చిన్నారులు చిన్నవయసులోనే తనువు చాలించారు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణపురం తండాకు చెందిన రవినాయక్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రవి నాయక్‌కు సొంత అక్క కూతురు వసంతతోనే 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా. హైదరాబాద్‌లో ఆటో నడిపే రవినాయక్ వారం, పదిరోజులకు ఓసారి ఇంటికి వచ్చి పెళ్లాం పిల్లలతో గడిపేవాడు. అయితే పెళ్లి సమయంలో రవినాయక్‌కు రెండు ఎకరాల పొలం కట్నంగా ఇచ్చారు. అప్పులు ఎక్కువ కావటంతో అందులో ఒక ఎకరం అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు రవినాయక్. ఈ విషయమై ఆదివారం ఉదయం తన అక్క దగ్గరకు వెళ్లి పొలం అమ్మాలనుకున్న సంగతిని చెప్పాడు.. అయితే అందుకు ఆవిడ అంగీకరించలేదు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఇంటికి వచ్చిన రవినాయక్ భార్యకు ఈ విషయం చెబితే.. వసంత కూడా తన అమ్మకు మద్దతుగా మాట్లాడింది. పొలం అమ్మేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వసంత పుట్టింటికి వెళ్లేందుకు బయల్దేరింది. అయితే ఆ ప్రయత్నాన్ని రవినాయక్ అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ కోపంలోనే టీలో ఎలుకల మందు కలిపి పిల్లలు, భర్తకు ఇచ్చిన వసంత తాను కూడా తాగింది. అయితే టీ రుచి తేడారావటం, వాసన కూడా వస్తుండటంతో రవినాయక్ కొద్దిగా తాగి ఆ తర్వాత పక్కనపెట్టేశాడు. కానీ ఆలోపే పిల్లలు మాత్రం పూర్తిగా తాగేశారు. ఆ తర్వాత వాంతులతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చిన్నారుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం మరో చిన్నారితో పాటు భార్యాభర్తలు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలుకల మందు కలిపిన టీని రవినాయక్ కొద్దిగా మాత్రమే తీసుకున్న నేపథ్యంలో రవినాయక్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన తెలిసి ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు క్షణికావేశంలో వసంత తీసుకున్న నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుందని వాపోతున్నారు. అభం శుభం తెలియని అమాయకపు పిల్లలు అమ్మ కలిపిన టీ తాగి ప్రాణాలు పోగోట్టుకున్నారంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.