ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చట్ట సభల్లో నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాధగా ఉందన్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు హుందాగా లేదన్నారు. వెంకయ్యనాయుడు సీనియర్ జర్నలిస్ట్ జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వ్యవహారాలను ప్రస్తావిస్తూ.. తాను చంద్రబాబుకు ఇచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చారు.
2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే సమయంలో.. తనను గుంటూరులో కలిసినట్లు వెంకయ్య తెలిపారు. తాను ఎన్డీఏలోనే కొనసాగమని చంద్రబాబుకు సలహా ఇచ్చానని.. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదన్నారు. 'ఇంకా ఎన్డీఏలో కొనసాగితే నష్టమని.. లేదు, లేదు అసంతృప్తి ఎక్కువగా ఉంది.. అందుకే దూరంగా వెళ్లడం మంచిది' అని చంద్రబాబు తనతో చెప్పిన విషయాలను ప్రస్తావించారు.
తాను కూడా 'వెళ్లదలుచుకుంటే వెళ్లు.. రెండు పనులు మాత్రం చేయొద్దు.. ఒకటి వ్యక్తిగతంగా నరేంద్ర మోదీని విమర్శించొద్దు.. రెండు అప్పటి పరిస్థితుల్ని బట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలవొద్దు' అని సలహా ఇచ్చినట్లు వెంకయ్య చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాత్రం తాను చెప్పినదానికి విరుద్దంగా వెళ్లారని.. ఆ తర్వాత ఎన్నికల్లో నష్టపోయారన్నారు. దేశం, రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుకు ఎన్డీఏ నుంచి బయటకు రావొద్దని చెప్పానని.. కానీ ఆయన మాత్రం తన సలహాను పట్టించుకోలేదన్నారు.
తనకు ఉపరాష్ట్రపతి పదవి వస్తుందని అనుకోలేదు, కోరుకోలేదన్నారు వెంకయ్య. తాను వివిధ హోదాల్లో, కేంద్రమంత్రిగా పనిచేశానని.. కొనసాగినంత కాలం ప్రజా జీవితంలో ఉండి.. విధాన నిర్ణయాల్లో చురుకైన పాత్ర పోషించి.. ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుని స్వచ్ఛంద సేవ చేయాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఒకవేళ ఎవరినైనా పొగిడితే.. వాళ్ల గుణగణాలను చూస్తానన్నారు. అలాగే చంద్రబాబు సాన్నిహిత్యం వల్లే.. తనకు రాష్ట్రపతి పదవి రాలేదనడం సరికాదన్నారు.
గతంలో తాను, ఎన్టీఆర్ ఒకటే అని ప్రచారం చేశారని.. అప్పటి ఎన్నికల్లో తాను పోటీచేసిన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రచారానికి ఎన్టీఆర్ రాలేదన్నారు. కొందరు తనకు ఎన్టీఆర్ ఇలా సాయం చేస్తున్నారని భావించారని.. కానీ నెల్లూరు జిల్లాలో 11 సీట్లలో 10 టీడీపీ గెలిస్తే.. ఉదయగిరిలో మాత్రం తాను గెలిచానన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని.. మొత్తం 11 రాష్ట్రాలు హోదాను అడుగుతున్నాయన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. అందుకే ఎలాంటి కామెంట్స్ చేయదలచుకోలేదన్నారు. వెంకయ్య నాయుడు గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందనడం సరికాదన్నారు.. తనకు పార్టీ (బీజేపీ)నే ముఖ్యమన్నారు.