ఒక్క అబద్ధం చెప్పనందుకు అధికారం కోల్పోయానని అన్నారు సీఎం జగన్. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం జగన్ సుధీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా 2014 ఎన్నికలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే స్వల్ప ఓటు షేరుతో వైసీపీ అధికారాన్ని దూరం చేసుకుంది. టీడీపీకి, వైసీపీకి మధ్య ఓట్ల షేరింగ్ చాలా తక్కువ.
ఈ నేపథ్యంలో అప్పట్లో ఏం జరిగిందనేదీ అసెంబ్లీలో వివరించారు సీఎం జగన్. 2014 శాసనసభ ఎన్నికల సమయంలో టీడీపీ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని జగన్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో తమ పార్టీ నేతలు, కొంతమంది శ్రేయోభిలాషులు వైసీపీ కూడా రుణమాఫీ చేస్తుందనే హామీ ఇవ్వాలని తనను కోరారని చెప్పారు. అయితే రుణమాఫీ అమలు సాధ్యం కాదనే ఉద్దేశంతో తాను అందుకు ఒప్పుకోలేదన్నారు.
"రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీ ఇద్దామని చాలామంది పార్టీ నేతలు, శ్రేయోభిలాషులే సలహా ఇచ్చారు. అయితే చేయలేనిది చెప్పకూడదు. మాట ఇస్తే తప్పకూడదని వాళ్లందరికీ చెప్పా. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా.. ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా.. ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 2014లో చంద్రబాబు నాయుడు కూటమికి వచ్చిన ఓట్లు,వైసీపీకి వచ్చిన ఓట్లు ఎంతని పరిశీలిస్తే.. ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా కనిపిస్తుంది. 46 శాతం వాళ్లకొచ్చాయి. వైసీపీకి 45 శాతం వరకూ వచ్చాయి. అలా ఒక్కరోజు అబద్ధం ఆడని కారణంగా, అధర్మం చేయని కారణంగా ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమై ప్రతిపక్షాలో కూర్చున్నాం".. అంటూ జగన్ గుర్తుచేసుకున్నారు.
మరోవైపు మాట మీద నిలబడినందుకే 2019 ఎన్నికల్లో జనం వైసీపీని గుండెల్లో పెట్టుకున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారన్న జగన్.. వాగ్దానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదని అన్నారు. మనసు లేని నాయకుడు.. మోసం చేసే నాయకుడు చంద్రబాబని విమర్శి్ంచారు. చేయలేనివి చెప్పకూడదు మాట ఇస్తే తప్పకూడదన్న జగన్.. అలవికాని హామీలిచ్చి అమల్లో దారుణంగా విఫలమైనందుకు, అన్ని వర్గాల వారిని మోసం చేసినందుకు 2019లో 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయన్నారు. మాట మీద నిలబడినందుకు వైసీపీకి 151 సీట్లు వచ్చాయని చెప్పారు. విశ్వసనీయతదే ఎప్పటికీ విజయమన్న జగన్.. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని 2024 ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
నా పథకాలను టచ్ కూడా చేయలేరు..
మరోవైపు వైసీపీ ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చుచేస్తేనే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్న చంద్రబాబు.. తానిచ్చిన హామీల అమలు కోసం రూ.1.26 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడని సీఎం జగన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ఎనిమిది పథకాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టచ్ చేయలేవని అన్నారు. పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్, సబ్బిడీ బియ్యం, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాలను టచ్ చేసే ధైర్యం ఏ ప్రభుత్వాలకు లేదన్నారు.