యువకులలో ధార్మిక భావాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ద్రవిడ వేదానికి ప్రాచుర్యం కల్పించేలా.. పాఠశాల విద్యార్థులకు హైందవ ధర్మం పట్ల అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాలను ప్రచారం చేస్తామన్నారు. తిరుమలలో మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. ఈ సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ ఛైర్మన్ శుభవార్త చెప్పారు. తిరుమలలో వున్న 108 తీర్థాలను భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతిని కూడా తిరుమల తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.మతాంతీకరణలు అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. శిథిలావస్థలో వున్న ఆలయాలు పునరుద్ధరణ చెయ్యడంతో పాటు బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో నూతన ఆలయాలు నిర్మిస్తామన్నారు. గో సంరక్షణ చేయాలని ఈ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు.
ధార్మిక సంస్థలను ఏకీకృతం చెయ్యడం, టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామ స్థాయిలో సదస్సుని నిర్వహిస్తామన్నారు. అలాగే ఏడాదికి ఒక్కసారి ధార్మిక సదస్సును నిర్వహిస్తామన్నారు. హిందు మతాన్ని నమ్మి, ఈ ధర్మాని ఆచరించాలన్న ఇతర మతస్థులకు తిరుమల క్షేత్రంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర మతస్థులు హిందూ మతంలోకి మారేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తే, తిరుమలలో మతమార్పిడి చేయించి వారికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. ప్రవచనకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు భూమన.