నంద్యాల జిల్లా శ్రీశైలంలో అక్రమంగా దాచిన తెలంగాణ మద్యం పెద్దమొత్తంలో పట్టుబడింది. మార్చి ఒకటో తేదీ నుంచి మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. తెలంగాణకు చెందిన ఓ మహిళ వద్ద166 మద్యం బాటిళ్లు గుర్తించారు. మహిళను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‍కు తరలించారు. మహాశివరాత్రి వేడుకలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ పర్వదినం రోజున శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావించిందో మహిళ. తెలంగాణకు చెందిన ఆ మహిళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు శ్రీశైలానికి మకాం మార్చింది. క్షేత్రంలోని టోల్‌గేట్ సమీపంలోని ఓ ఇంట్లో దిగింది. అలాగే వివిధ రకాలకు చెందిన166 క్వాటర్ బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని రెడీ చేసుకుంది. శ్రీశైలం వచ్చేవారికి వీటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంది. కానీ సీన్ రివర్సైంది. భారీగా దాచిన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ తెలంగాణ రాష్ట్రం మున్ననూర్ నుంచి అక్రమంగా మద్యం తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన మద్యం బాటిళ్లలో వివిధ రకాల బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు. ఆ మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సమయంలో ఆలయ పరిధిలో నిబంధనలు మీరి ఎవరైనా మద్యం, మాంసం తెచ్చి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.