ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త.. అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడి పాలెంలో పాస్టర్లతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడనంటూనే.. పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బలవంతుడిని ఓడించేందుకు దేవుడెప్పుడూ బలహీనుడినే ఎంచుకుంటాడని అభిప్రాయపడ్డారు అనిల్ కుమార్. ఏమీ తెలియని స్థితిలో ఉన్నపుడు ఓ ఉన్నతమైన పిలుపు ఇస్తాడని పాస్టర్లతో చెప్పుకొచ్చారు. రాజకీయాలు మాట్లాడేందుకు తాను ఇక్కడికి రాలేదన్న అనిల్ కుమార్.. దేవుడి రాజ్యం గురించి చెప్పేందుకే వచ్చానని అన్నారు.
మరోవైపు ఇటీవలే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణులు కాస్తా షర్మిల రాకతో కాస్త యాక్టివ్ అయ్యారు. ఇదే సమయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీలపై షర్మిల విరుచుకుపడుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం సహా అనేక అంశాల్లో రెండు పార్టీలు బీజేపీతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని షర్మిల ఆరోపిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా.. వైసీపీ, టీడీపీ లొంగిపోవటంతో రాష్ట్రాన్నే ఏలుతుందని విమర్శిస్తున్నారు . అలాగే సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా షర్మిల విరుచుకుపడుతున్నారు. వైసీపీ కోసం తాను రక్తం ధారపోస్తే ఇప్పుడు తనపైనే విమర్శలు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే షర్మిల విమర్శలకు అటు వైసీపీ నుంచి కూడా కీలక నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.
మరోవైపు 2019 ఎన్నికల్లో బీసీలు, రెడ్డి సామాజికవర్గంతో పాటు క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు, ఎస్సీ,ఎస్టీలు జగన్‌కు జై కొట్టారు. అయితే వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గంలో కొంత ఓటు షేర్ కాంగ్రెస్ వైపు మళ్లుతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా షర్మిల భర్త కూడా రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రదర్ అనిల్ కుమార్ పాస్టర్లతో మీటింగ్ కావటంతో అనిల్ కుమార్ ద్వారా క్రిస్టియన్ల ఓట్లకు గాలం వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే బ్రదర్ అనిల్ కుమార్ తానేమీ రాజకీయాలు మాట్లాడలేదని అంటూనే.. బలవంతుడిని ఓడించేందుకు దేవుడెప్పుడూ బలహీనుడినే ఎంచుకుంటాడంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.