అవయవ దానం ద్వారా మరెన్నో ప్రాణాలకు ఊపిరి పోయవచ్చు. మరణం అంచున ఉండేవారికి రెండో జీవితాన్ని ప్రసాదించవచ్చు. కర్నూలుజిల్లాకు చెందిన మహిళ తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది. అవయవదానంతో వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. కర్నూలులోని బాలాజీనగర్‌కు చెందిన పావని లత భర్త శ్రీనివాసరెడ్డి రెండేళ్ల క్రితం కిడ్నీ సమస్యతో చనిపోయాడు. మూర్ఛ వ్యాధితో బాధపడుతన్న ఆమె ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బ్రెయిన్ డెత్ కావడంతో ఆమెను వెంటిలేటర్ సాయంతో ఈ నెల 3న కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్చారు.
ఈ విషయం తెలియడంతో రెడ్‌క్రాస్ ప్రతినిధి, ట్రాన్స్ ప్లాంటేషన్ కోఆర్డినేటర్స్ తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, సువర్ణమ్మలకు కౌన్సెలింగ్ చేయడంతో కూతురు చివరి మాటను దృష్టిలో పెట్టుకుని అవయవదానం చేసేందుకు ముందుకువచ్చారు. మంగళవారం ఆసుపత్రిలో జీవన్‌దాన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రభార్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. యూరాలజిస్టు డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ అనంత్, అనస్థీషియా డాక్టర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి బ్రెయిన్ డెత్ అయిన పావని లత నుంచి రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, కార్నియాలను సేకరించారు.
ఒక కిడ్నీని కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఊపిరితిత్తులను హైదరాబాద్‌లోని కిమ్స్‌కు, కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రికి, కార్నియాను కర్నూలులోని రెడ్‌క్రాస్‌కు తరలించారు. అవయవాల తరలింపునకు గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన పావని లత తల్లిదండ్రులను కలెక్టర్ కలెక్టర్ డా సృజన అభినందించారు. అవయవదానం వల్ల బాధితులను ఆదుకోవడంతోపాటు చనిపోయినవారు బతికున్నట్లుగా భావించవచ్చన్నారు. సర్వజన వైద్యశాలలో బ్రెయిన్ డెత్ అయిన కేసును జీవన్‌దాన్ ద్వారా కెడవర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడంతో మొదటిసారి.