విశాఖలో హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించింది. అలాగే తహసీల్దార్ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటికే స్థానిక మంత్రులు రమణయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
విశాఖలో తహసీల్దారు రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. బదిలీపై వెళ్లి విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే తహసీల్దారు రమణయ్య చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తహసీల్దార్ సనపల రమణయ్య బదిలీపై విజయనగరం జిల్లాకు వెళ్లారు.. గత శుక్రవారం (ఫిబ్రవరి 2న) కొత్త చోట బాధ్యతలు తీసుకుని, తిరిగి విశాఖలోని తననివాసానికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి పది గంటల సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం దిమిలాడ గ్రామానికి చెందిన సనపల రమణయ్య 2012లో గ్రూపు-2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరారు. ఆరేళ్ల కిందట తహసీల్దారుగా పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పనిచేశారు. గత ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన విశాఖ రూరల్ తహసీల్దారుగా బదిలీపై వచ్చారు. కొమ్మాదిలో ఎస్‌టీబీఎల్ థియేటర్ వెనుక గల అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు.
రమణయ్య ఘటన జరిగిన రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు సెల్లార్‌లో తహసీల్దార్ రమణయ్యతో మాట్లాడారు. వాళ్లిద్దరూ వెళ్లిన వెంటనే మాస్క్ ధరించి ఉన్న మరొక వ్యక్తి వచ్చి రాత్రి పది గంటల సమయంలో అపార్టుమెంట్ సెల్లార్‌లో రమణయ్యతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పది నిమిషాలపాటు చర్చ జరిగింది. తహసీల్దార్ మాట్లాడుతున్న సమయంలో చేతులు కట్టుకుని ఉన్న నిందితుడు ఒక్కసారిగా తన వెంట తెచ్చిన ఇనుపరాడ్డుతో రమణయ్య తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తర్వాత పలుమార్లు రాడ్‌తో తలపై విచక్షణారహితంగా మోదడంతో తీవ్రంగా గాయపడ్డారు.
రమణయ్య కింపడిపోగానే చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి వాచ్‌మన్ రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను చూసి పరుగున ఆయన ఫ్లాట్‌కు వెళ్లి విషయం చెప్పాడు. రమణయ్య భార్య కిందికి వచ్చి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయడంతో పాటు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మూడు గంటలకు రమణయ్య మృతిచెందారు. ఈ సమాచారం అందగానే సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించడంతోపాటు వాచ్‌మన్, కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారిని విచారించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మురారి సుబ్రహ్మణ్యంను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు.