ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ముందు రోజు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్.. 25 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2024, 08:12 PM

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 2 ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటివరకు 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 42 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. బుధవారం జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లతో బలూచిస్తాన్ ప్రావిన్స్ వాసులు వణికిపోయారు. అయితే గురువారం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. సరిగ్గా దానికి ఒక రోజు ముందు బాంబు పేలుళ్లు సంభవించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నివాసాల సమీపంలో ఈ బాంబు పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది. ఈ బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సంతాపం తెలిపారు.


అయితే మొత్తం ఇప్పటివరకు రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లు జరిగినట్లు పాక్ మీడియా వెల్లడించింది. పాక్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ నివసించే పిషిన్ జిల్లాలో జరిగిన మొదటి పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలిపింది. ఇక ఈ పేలుడు జరిగిన అరగంట లోపే మరో బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు. ఖిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్ ఉలేమా ఇస్లాం పాకిస్థాన్ ఎన్నికల కార్యాలయం బయట మరో బాంబు పేలింది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరో 12 మంది గాయపడినట్లు తెలిపారు.


ఇక స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ నివాసం ముందు ఒక బ్యాగును ఉంచారని.. అందులో ఉన్న బాంబును రిమోట్ సాయంతో పేల్చినట్లు బలచిస్తాన్‌లోని పంజ్‌గుర్ సీనియర్ పోలీస్ అధికారి అబ్దుల్లా జెహ్రీ వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు క్వెట్టా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు లభ్యం అయ్యాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.


ఈ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్ స్టేషనన్‌కు వెళ్లి ఓట్లు వేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని.. అబ్దుల్లా జెహ్రీ తెలిపారు. అయితే ఏం జరిగినా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని మరింత పెంచుతున్నట్లు చెప్పారు. ఇక ఖిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని ఎన్నికల కార్యాలయం వద్ద జరిగిన మరో పేలుడులో జేయూఐ పార్టీ అభ్యర్థి మృతి చెందారని.. ఇది చాలా నష్టం కలిగించిందని పేర్కొన్నారు.


ఈ రెండు భారీ బాంబు పేలుడు ఘటనలను పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ఈ బాంబు దాడులను బలూచిస్తాన్ హోం మంత్రి జాన్ అచక్జాయ్ తీవ్రంగా ఖండించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక ఈ దాడులను పాకిస్థాన్ ఆపద్దర్మ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గోహల్ ఇజాజ్ తీవ్రంగా ఖండించారు. పిషిన్ జిల్లాలోని ఎన్నికల సంఘం కార్యాలయం ముందు జరిగిన బాంబు పేలుడు తీవ్ర బాధాకరం అని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపం ప్రకటించారు.


ఇక ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రస్తుతం హింసాత్మక సంఘటనలు భారీగా జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ బాంబు పేలుళ్లు మరింత ఎక్కువ అయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సెక్యూరిటీ పోస్ట్‌లు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ఎన్నికల ర్యాలీలతోపాటు వివిధ ప్రాంతాల్లో మంగళవారం 10 గ్రెనేడ్ దాడులు చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాదాపు 50 దాడులు జరిగినట్లు తెలిపారు. సిబి పట్టణంలో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి చేపట్టిన ఎన్నికల ర్యాలీలో జరిగిన దాడుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com