మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని 2 వేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ మత పరమైన కార్యక్రమానికి భారీగా జనం హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల్లో వారంతా తిన్నారు. అప్పటివరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కార్యక్రమంలో భోజనం చేసిన వారంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడ ఫుడ్ పాయిజన్ కావడంతో వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో వారంతా ఆస్పత్రులకు క్యూ కట్టారు.
నాందేడ్ జిల్లాలోని కోష్టవాడి గ్రామంలో మంగళవారం ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామం వారే కాకుండా పక్కనే ఉన్న సవర్గాన్, పోష్ట్‌వాడి, రిసన్గావ్, మాస్కి గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆ భోజనాలు తిన్న తర్వాత కొందరు అస్వస్థత బారిన పడ్డారు. బుధవారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలు కావడంతో తీవ్ర నీరసంతో వారు అనారోగ్యానికి గురయ్యారు. అయితే ముందుగా సీరియస్‌గా ఉన్న 150 మందిని నాందేడ్ జిల్లాలోని లోహా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వందలాది మంది ఇదే రకమైన ఇబ్బందులతో ఆస్పత్రుల్లో చేరారని స్థానికులు వెల్లడించారు.
అయితే ఈ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నవారు కాకుండా మరో 870 మంది కూడా అక్కడ ఇవే సమస్యలతో బాధపడుతునట్లు తెలుస్తోంది. దీంతో వేలాది మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో స్థానిక వైద్య యంత్రాంగం అప్రమత్తం అయింది. అనారోగ్యంతో వచ్చే రోగుల కోసం అదనంగా బెడ్‌లు, మందులు, ఇతర మెడికల్ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. చాలా మందిలో ఇవే లక్షణాలు కనిపించడంతో వారి నుంచి రక్త నమూనాలు సేకరించి తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించారు. ఈ ఫుడ్ పాయిజన్ ప్రభావిత గ్రామాల్లో సర్వే కోసం 5 వైద్య బృందాలను నియమించారు. వీటితో పాటు రెస్పాన్స్ టీమ్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.