ఇండియా కూటమి నుంచి మరో పార్టీ తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ.. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉండగా.. ఆ పార్టీకి బీజేపీ వైపు నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇండియా కూటమిలో ఉందో లేదో క్లారిటీ లేని సమాజ్ వాదీ పార్టీతో ఇటీవలె రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ సరికొత్త పొత్తును ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్రీయ లోక్ దళ్‌తో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీగా సీట్లు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
జాట్‌లు, దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతుల్లో మంచి పట్టున్న రాష్ట్రీయ లోక్ దళ్-ఆర్ఎల్‌డీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆర్ఎల్‌డీని ఎన్డీఏలో కలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే 5 పార్లమెంటు స్థానాలతోపాటు 2 మంత్రి పదవులను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్ఎల్‌డీ నేషనల్ ఛైర్మన్ జయంత్ చౌదరీని కాక పడుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీని వల్ల యూపీలో సమాజ్ వాదీతో దోస్తీ వదిలేసి తమ వైపు జయంత్ చౌదరీ వస్తారని బీజేపీ ఆశలు పెట్టుకుంది.
అయితే యూపీలో ఆర్ఎల్‌డీ, సమాజ్ వాదీ పార్టీ చాలా కాలంగా పొత్తులో ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉండగా.. గత నెలలోనే ఇండియా కూటమి కాకుండా వేరుగా పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఈ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీకి 7 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. జనవరి 19 వ తేదీన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తును ప్రకటించాయి.
అయితే ఆర్ఎల్‌డీకి ఈ ఎన్నికల్లో 2 లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్య సభ స్థానంతోపాటు యూపీలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే వీటికి అదనంగా కనీసం 3 లోక్‌సభ స్థానాలు, మరొక కేంద్రమంత్రి పదవి కావాలని ఆర్ఎల్‌డీ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మాజీ ప్రధాని, యూపీ మాజీ సీఎం చరణ్ సింగ్‌కు మరణానంతరం భారతరత్న ఇవ్వాలని మరో డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఆర్ఎల్‌డీ నేషనల్ ఛైర్మన్‌గా ఉన్న జయంత్ చౌదరీ రాజ్యసభ సభ్యుడు కాగా.. మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు కూడా కావడం గమనార్హం.
ఇక ఆర్ఎల్‌డీని ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. జయంత్ చౌదరి చదువుకున్న వ్యక్తి అని.. రాజకీయాలను బాగా అర్థం చేసుకుంటాడని.. పేర్కొన్నారు. రైతుల కోసం చేస్తున్న పోరాటాన్ని జయంత్ చౌదరీ బలహీనపరచనివ్వడని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ శివ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ.. జయంత్ చౌదరీ ఎక్కడికీ వెళ్లడని.. బీజేపీ గందరగోళాన్ని సృష్టించేందుకే ఇలాంటి వార్తలను తెరపైకి తెస్తోందని విమర్శించారు.
ఇక ఆర్‌ఎల్‌డీ పార్టీ ఎన్డీఏలోకి చేరుతుందని వస్తున్న వార్తలను ఆ పార్టీ నేత రాజీవ్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ పనికిరాని పుకార్లు అంటూ కొట్టిపారేశారు. ఎన్నికలకు కొన్ని వారాలే సమయం ఉన్నందున పార్టీ నేతలు అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. తమ పార్టీ అధినేత జయంత్ చౌదరీ ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోరని తెలిపారు. బీజేపీలో చేరేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని.. జయంత్ చౌదరీ బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఎన్డీఏలోకి ఆర్ఎల్‌డీ చేరుతుందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు.