కేంద్ర ప్రభుత్వంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా పన్నులు చేరుతున్నాయని.. కానీ తిరిగి రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లలో మాత్రం దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా గగ్గోలు పెడుతున్నాయి. తమ నుంచి ఎక్కువ డబ్బులను పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని.. ఉత్తర భారత రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని ఖర్చు చేస్తోందని దక్షిణ భారత దేశ రాష్ట్రాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇక ఇప్పటికే కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తమ నుంచి కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఎక్కువ డబ్బులు తీసుకుని అందులో చాలా తక్కువ మాత్రమే వెనక్కి ఇస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇక ఉత్తర భారత రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వచ్చిన పన్నుల కంటే ఎక్కువ ఖర్చు చేస్తోందని మండిపడుతున్నాయి.
తమకు రావాల్సిన నిధులు రావట్లేదని ఆరోపణ
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 15 వ ఆర్థిక సంఘం ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా గత 5 ఏళ్లలో పన్నుల్లో వాటా, గ్రాంట్లు, సహా ఇతరత్రాలు అన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటకకు రావాల్సిన రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయిందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసమే తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇక కర్ణాటకలో పలు నీటిపారుదల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని కర్ణాటక సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు.
కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టుకు ఎక్కిన కేరళ
గతంలో కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు పన్నుల్లో వాటాలు సరిగ్గా అందడం లేదని బహిరంగంగానే తీవ్ర విమర్శలు, అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఇక కేరళలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ సర్కార్ అయితే ఏకంగా తమకు రావాల్సిన పన్నుల వాటా కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రాలు తీసుకునే అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల చూపిస్తున్న పక్షపాత వైఖరిని తట్టుకుని రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో పడేయలేమని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేఎన్ బాలగోపాలన్.. ఇటీవల సోమవారం జరిగిన కేరళ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పష్టం చేశారు.
కేంద్రంపై బీఆర్ఎస్ సర్కార్ గరం గరం
ఇక గతేడాది తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కూడా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌ఛార్జ్‌లపైనే ఆధారపడుతుండటంతో రాష్ట్రాలు కేవలం 30 శాతం మాత్రమే నిధులు పొందుతున్నాయని.. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆ సెస్‌లు, సర్‌ఛార్జీలు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం పంచుకునే వీలు లేదని పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చిన పన్నుల వాటా 2.893 శాతంగా ఉంటే అది 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 2.102 కు తగ్గించారని ఆరోపించారు.