భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. నేడు హేమంత్ సోరెన్, కల్పనా సోరెన్‌ల 18 వ పెళ్లి రోజు కాగా.. ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన ఎక్స్ ఖాతాలో కల్పనా సోరెన్ ఒక ఎమోషనల్ మెసేజ్‌ను అందించారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు హేమంత్ సోరెన్ పోరాటం చేస్తున్నారని.. కొందరు చేస్తున్న కుట్రకు ఆయన తల వంచలేదని తెలిపారు. హేమంత్ సోరెన్ ఓటమిని అంగీకరించలేదని పోరాటం కొనసాగిస్తారని కల్పనా సోరెన్ తేల్చి చెప్పారు.
"ఇవాళ మా 18 వ పెళ్లి రోజు కానీ.. ప్రస్తుతం హేమంత్ సోరెన్ తన కుటుంబంతో లేరు. అయినా నేను ఏమీ బాధపడట్లేదు. ఎందుకంటే నేను జార్ఖండ్ వీరుడి భార్యను.. ఆయనలాగే నేను కూడా క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాను. నా మొహంపై చిరునవ్వు చెదరనివ్వకుండా హేమంత్ సోరెన్‌కు అండగా ఉంటాను" అని హేమంత్ సోరెన్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో కల్పన సోరెన్ వెల్లడించారు. జార్ఖండ్ ఉనికిని, గుర్తింపును కాపాడటానికి హేమంత్ సోరెన్ తలవంచరని తేల్చి చెప్పారు. త్వరలోనే ఈ కుట్రలను ఛేదించి.. హేమంత్ సోరెన్ ఇంటికి తిరిగి వస్తారని నమ్ముతున్నాను అంటూ వారిద్దరూ గతంలో దిగిన ఓ ఫోటోను కల్పనా సోరెన్ పంచుకున్నారు.
జార్ఖండ్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయకముందే.. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో మరింత విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు.. గత నెల 31వ తేదీన అర్థరాత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తగా.. జేఎంఎం సీనియర్ నేత, సోరెన్ కుటుంబానికి సన్నిహితుడు అయిన చంపై సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోగా.. అనేక డ్రామాల మధ్య ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇటీవలె జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించగా.. చంపై సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ బలపరీక్షకు జైలు నుంచి వచ్చి హాజరైన హేమంత్ సోరెన్.. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు.
ఇక భూ కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలు, ఈడీ విచారణను హేమంత్ సోరెన్ ఖండించారు. తన అరెస్ట్ వెనుక జార్ఖండ్ రాజ్‌భవన్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 8.5 ఎకరాల భూ కుంభకోణంలో ప్రస్తుతం తాను అరెస్ట్ అయ్యానని.. అయితే దమ్ముంటే వారు ఆ భూమి పత్రాలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు ఆధారాలు చూపాలని హేమంత్ సోరెన్ సవాల్ విసిరారు. ఒకవేళ అలాంటి ఆధారాలు వారు బయట పెడితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేయడానికి 2022 నుంచి కుట్రలు జరుగుతున్నాయని.. హేమంత్ సోరెన్ ఆరోపించారు.