అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అత్యధిక గౌరవ వేతనం అందించే ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంగన్వాడీలకు సగటున 7 వేల రూపాయల చొప్పున అత్యధిక నెలసరి వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక ఉన్నట్లు ఆమె గణాంకాలతో సహా వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైయస్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు నెలకు రూ.7000, హెల్పర్లకు రూ.4,750 చొప్పున అదనపు గౌరవ వేతనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యధిక గౌరవ వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో తెలంగాణ, హర్యానా ఉండగా ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో అంగన్వాడీ వర్కర్లకు రూ.7వేల అదనపు గౌరవ వేతనం అందిస్తున్నప్పటికీ, అక్కడ హెల్పర్లకు కేవలం రూ.3500 మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ హెల్పర్లకు అత్యధిక గౌరవ వేతనం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.