సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్ళు మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టమని, చంద్రబాబుపై పెట్టిన ఫేక్ పోస్టులకు సంబంధించి పోలీసులుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారు కానీ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవంటూ పోలీసులపై మండిపడ్డారు. అమిత్ షా పిలుపు మేరకే తమ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారన్నారు. అక్కడి పరిణామాలపై పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుంది కానీ.. జగన్ లా వ్యక్తిగత స్వార్ధం కోసం ఉండదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.