మహా క్రీడా సంబరానికి విశాఖ సర్వం సిద్ధమైంది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తుది ఘట్టానికి చేరుకుంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. విశాఖ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. ఇక 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా చైన్నె సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ జట్లకు శిక్షణాపరమైన సహకారం అందించిన నిపుణులు ఈ పోటీలను వీక్షించేందుకు రానుండటం విశేషం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసి, వీరితో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.