ఏపీలో ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఈ నెల 27న ‘చలో విజయవాడ’కు సిద్ధమని ప్రకటించారు ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. తాము సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఉద్యోగులు దాచుకున్న వివిధ రకాల కాంపొనెంట్స్ డబ్బుతో పాటు పీఆర్సీ, డీఏ బకాయిలు, లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ వంటి ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని నెలలు గడుస్తున్నా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా సమస్యలు పరిష్కరించకపోవటంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.
12వ పీఆర్సీకి సంబంధించి కమిషనర్‌ను నియమించినా పనిచేయటానికి సిబ్బంది, కార్యాలయం వంటివి ఇవ్వలేదన్నారు. ఐఆర్‌ను కూడా ప్రకటించలేదని చెప్పారు. తాము 30 శాతం ఐఆర్‌ను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జీవోలు ఇచ్చినా అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే కార్యాచరణతో కూడిన ఉద్యమ శంఖారావం’ వాల్ పోస్టర్‌ను బండి ఆవిష్కరించారు. 12వ పీఆర్సీలో ఐఆర్ 30 శాతం తక్షణమే ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు కొత్త డీ ఏలు(జనవరి, జూలై-2023) తక్షణం ఇవ్వాలన్నారు. సీపీఎస్ వారీగా 90 శాతం నగదు రూపంలోనే డీఏలు చెల్లించాలన్నాు. పీఎఫ్, ఏపీజీఎల్‌వో లోన్లు-క్లెయిమ్స్, 11వ పీఆర్సీ అరియర్స్, సరెండర్ లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్చేశారు. అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ కార్డు ద్వారా నగదు రహిత వైద్యం అందించాలంటున్నారు. ఇంటి స్థలాలు, టీచర్లకు అప్రెంటీస్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. జీవో 11 రద్దు చేయాలని.. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటున్నారు. స్థానిక సంస్థలు, జడ్పీ యాజమాన్యంలో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. సీపీఎస్, జీపీఎస్‌లు రద్దు.. ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ప్రతి నెలా 1నే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్నారు.
ఈ నెల 14న నల్లబ్యాడ్జీలతో విధులకు రావడం, తహసీల్దా ర్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలకు మెమొరాండం అందజేస్తారు ఉద్యోగులు. ఈ నెల 15, 16న మధ్యాహ్న సమయంలో తాలూకా, పాఠశాలల్లో నిరసనలు తెలుపుతారు. ఈ నెల 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీ-ధర్నాలు చేస్తారు. ఈ నెల 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు.. ఈ నెల 21 నుంచి 24 వరకు జిల్లా కేంద్రాల్లో పర్యటనలు.. 27న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. ఆర్థిక శాఖ కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రివర్గ బృందం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఏపీజీఏడీ శాఖ 13 సంఘాల నేతలకు లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది.