ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం తర్వాత ఏపీలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ ఏపీవాసులను మోసం చేశాయన్న షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు. మరోవైపు షర్మిల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ నేతలు.. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వైసీపీ సీనియర్ లీడర్ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకహోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపైనా రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ తరుఫున వైవీ సుబ్బారెడ్డి కూడా పోటీచేస్తున్నారు. సోమవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై రాజ్యసభలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటుచేసేంత వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని అన్నారు. ఇదే సమయంలో ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకూ ప్రత్యేక హోదా తేవడం కూడా కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు అవసరమని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.