బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తమిళనాడు శాసనసభలో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ రాసిచ్చిన ప్రసంగం చదవకుండా మధ్యలో గవర్నర్ రవి వాకౌట్ చేశారు. సాధారణంగా చట్టసభలో ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దానిని విభేదించి ప్రతిపక్షం వాకౌట్ చేసి బయటకు వెళ్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ అధికార, ప్రతిపక్షాలు కూడా వాకౌట్ చేసిన చరిత్ర ఉంది. కానీ, ఏకంగా గవర్నరే అసెంబ్లీ నుంచి వాకౌట్ ప్రకటించడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు.
బడ్టెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ ఆర్.ఎన్ రవి ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే, అధికార డీఎంకే వైఖరిపై గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించాల్సి ఉండగా.. క్షణాల్లోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. సభ ప్రారంభం కాగానే సెషన్‌కు సంబంధించిన ఎజెండాను వివరించిన స్పీకర్ అప్పావు.. ప్రభుత్వ ప్రసంగం చదివారు. అయితే, గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించి జాతీయ గీతం కోసం కూడా వేచి చూడకుండా హడావిడిగా బయటకు వెళ్లిపోయారు.
దీనిపై గవర్నర్ మాట్లాడుతూ.. తన ప్రసంగానికి ముందు, తరువాత జాతీయ గీతాన్ని ఆలపించకపోవం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు.. ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తూర్పారబట్టారు. అందుకే తాను సభ నుంచి వాకౌట్ ప్రకటించానని ఆర్.ఎన్ రవి స్పష్టం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై స్పీకర్ స్పందిస్తూ.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు రాష్ట్ర గీతం ‘తమిజ్ థాయ్ వాజ్తు"’ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించే సంప్రదాయం కొనసాగుతుందని అన్నారు. స్పీకర్ వ్యక్తిగత అభిప్రాయాలను సభలో పంచుకోవద్దని, దానికి బదులుగా పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ. 50,000 కోట్ల వరద సాయాన్ని కేంద్రం విడుదల చేసేలా చూడాలని కోరారు.
గత ఏడాది కూడా ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలోని కొన్ని అంశాలను గవర్నర్ చదవకుండా దాటవేయడంతో నాటకీయ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పెరియార్, బీఆర్ అంబేద్కర్, కె కామరాజ్, సిఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నాయకుల గురించి ప్రస్తావించలేదు. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ అధికారిక ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని తీర్మానం చేశారు. . ఈ వ్యవహారం గవర్నర్, స్టాలిన్ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా మరోసారి గవర్నర్ ప్రసంగించేందుకు నిరాకరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.