చంద్రబాబు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని, చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై మేం స్పందించమన్నారు. ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా నాయకుడు సీఎం వైయస్ జగన్ ఒకటే చెప్తున్నారు. మేము మంచి చేశాం అనుకుంటేనే మళ్లీ నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. అలా అనడంలో తప్పు ఏముంది? అని మంత్రి ప్రశ్నించారు. అనుభవం వున్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించిన ఆయన.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల ను వక్రీకరించారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడూ చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే.. హైదరాబాద్ విశ్వనగరం.. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చు. అదేం ప్రశాంత్‌రెడ్డి ఆస్తి కాదు. మా పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా విభజన హామీలు సాధించడమే. మేము ప్రజలు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతాం ఇలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదు. చంద్రబాబు, పవన్‌కు ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు. కానీ వీళ్ళకి ఇక్కడ రాజకీయాలు కావాలని మంత్రి బొత్స దుయ్యబట్టారు. రాజధాని పై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదన్నారు. ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు. విభజన చట్టంలో అప్రస్తుతంగా వున్న సమస్యల పరిష్కా రం కోసం ప్రయత్నిస్తానని మాత్రమే వైవీ సుబ్బారెడ్డి చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.