బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని.. ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్‌కు మార్చారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి రాజధాని అన్నారన్నారు. విశాఖలో భూములు లాక్కునేందుకు జగన్ అక్కడ రాజధాని అని అన్నారని మండిపడ్డారు. వీళ్లిద్దరూ రాయలసీమ ద్రోహులని.. తిరుపతి రాజధాని వద్దని వీరు ప్రకటించగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా హైదరాబాదే మళ్లీ రాజధాని అని పలుకుతున్నారన్నారు. పరిణామాలు చూస్తే.. మళ్లీ తిరుపతి రాజధానిగా మారుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. రాయలసీమలో ఎప్పుడు కరవు, కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే.. తిరుపతి రాజధాని కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూడా రాజధాని అయ్యాకే అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని.. అందుకే తిరుపతి రాజధాని చేయాలన్నారు. తిరుపతి రాజధాని అనేందుకు సహేతుకమైన కారణాలు తాను చూపించానన్నారు. ఇది తప్పు అని ఎవరైనా చెప్పగలరా?, కాదలగలరా? అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్నారు. తిరుపతి రాజధాని చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రం మొత్తం పర్యటిస్తానన్నారు. తిరుపతిలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని.. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నిర్మాణాలు చేయవచ్చన్నారు. ఏపీలో రాజకీయాలు చాలా నీచంగా తయారయ్యాయన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల వారు నేడు కోరుకుంటున్నారని తెలిపారు.