హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ, సుబ్బారెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే కొత్త పల్లవి. ఇది మీ స్టాండ్ నా...! లేక మీ పార్టీ స్టాండ్ నా సుబ్బారెడ్డి గారు...? మూర్కుడు రాజు కంటే బలవంతుడు... ఇక రాజే మూర్కుడు అయితే ఆ రాజ్యం ఇప్పుడున్న మన ఆంద్రప్రదేశ్‌లా తయారవుతుంది...! ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ప్రజలు మిమ్మల్ని ఛీ కొడతారు జగనన్న. విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే దిక్కులు చూసే పరిస్థితికి తీసుకువచ్చారు. రేపు వైసీపీలో అందరూ హైదరాబాద్ రాజధాని అనే కోరస్ పాడటం మొదలుపెడితే ఏమవుతుంది...? అంటే ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్లు మళ్ళీ పురిగొల్పాలని మీ ప్రయత్నమా....? ఈ ఐదేళ్ళ మీ తుగ్లక్ వైఫల్యాలపై నుంచి ప్రజల దృష్టి దీనిపైకి మళ్ళించవచ్చని భావించి ఈ ‘వ్యూహం’ ‘సిద్ధం’ చేస్తున్నారా...?’’ అంటూ గంటా శ్రీనివాసరావు ప్రశ్నలు సంధించారు.