ముగ్గురు వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు విజయరాజు వెల్లడించారు.అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం సీఈఓ ముకేశ్ కుమార్ మీనా, ఆయా అభ్యర్థుల తరుపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో పూర్తైందని విజయరాజు తెలిపారు. వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలించగా ముగ్గురు అభ్యర్థులు వారి నామినేషన్లతో అవసరమైన పలు డాక్యుమెంట్లన్నీ పూర్తి స్థాయిలో ఉన్నయో లేదో పరిశీలించారు. అనంతరం వారి నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్‌కు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన పత్రం లేకపోవడంతో తిరస్కరించడం జరిగింది. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 20వ తేదీ వరకూ గడువు ఉంది. ఆ రోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.