ఏపీ రాజకీయాల్లో కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఫేస్ అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ మాత్రం అలా కాదు డైలాగ్ చెప్పడం కాదు.. ఏకంగా కుర్చీని మడతపెట్టి వార్నింగ్ ఇచ్చేశారు. విజయనగరం జిల్లా నెలిమర్లలో జరిగిన శంఖారావం సభలో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే వైఎస్సార్‌సీపీ నేతల్ని ఊరుకునేది లేదన్నారు.
'మీరు చొక్కాలు మడతపెడితే.. మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తాం' అంటూ కౌంటరిచ్చారు. అక్కడితో ఆగకుండా ఎలా చేస్తామో చూపిస్తామంటూ.. ఆ సభలోనే ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అమ్మలాంటిదని.. ఈ ప్రాంత ప్రజలకు కష్టపడటం తప్ప మాయామర్మాలు తెలియవన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా, రైతులంటే జగన్‌కు భయమేస్తోందన్నారు. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారన్నారు. ఈ ఐదేళ్లలో మూడు రాజధానులన్నారు.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? అని ప్రశ్నించారు. మూడు ముక్కలాట ఆడుతున్న వైఎస్సార్‌సీపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ మచ్చ తేవాలనుకున్నారని.. ప్రపంచం అంతా చంద్రబాబు అభిమానులు ఎంత మంది ఉన్నారో జగన్ కుట్రతో తేలిపోయిందన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. ఇప్పుడేం చెబుతారు? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ దుకాణాల దగ్గర చర్చ పెట్టుకుందామంటూ సవాల్ చేశారు.. అక్కడికి వచ్చేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అధికారులను నియమించి టార్గెట్ పెడుతోందని.. ఐదేళ్లుగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారన్నారు.
ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా?.. యువత నిలదీస్తారని పరదాలు కట్టుకుని సీఎం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్. ఎన్నికల ముందు ఇళ్లు కాదు.. ఏకంగా పట్టణాలు కడతామన్నారు. అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు నెలలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు లోకేష్.