తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. గతంలో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా కొన్ని యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు యాగాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికలకు ముందు ఇలాగే రాజశ్యామల యాగం చేయించారు.